Ticker

6/recent/ticker-posts

మహిళలకు ఉచిత బస్సు ఇవ్వమని ఎవరు అడిగారు.. వెంకయ్య నాయుడు సంచలన కామెంట్స్


ANDRAPRADESH, GUNTURU, TENALI: మహిళలకు రెండు తెలుగు రాష్ట్రాలు అందిస్తున్న ఉచిత బస్సు పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు ఎవరు అడిగారని ప్రశ్నించారు. ఉచితాలపై కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం సంపద సృష్టించే మార్గాలు చూడాలని సూచించారు. అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం సరికాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యం తప్ప మిగతావి ఉచితంగా ఇవ్వకూడదని అన్నారు. ఇలాంటి ఉచిత పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని గతంలో కూడా వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.


తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మొదట ఈ పథకాన్ని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఉచిత బస్సు హామి ఇచ్చి.. గెలిచిన తర్వాత అమలు చేస్తోంది. ఇక తెలంగాణ దారిలోనేఆంధ్రప్రదేశ్ కూడా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది. దీంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు.. పలు ఉచిత పథకాలను అందిస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ ఉచితాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు ఉవ్వమని ఎవరు అడిగారని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇస్తున్న ఉచిత పథకాలను ఉద్దేశించి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడారు. ఉచిత బస్సు ఇవ్వండి.. అందులో తాము తిరుగుతామని మహిళలు అడిగారా? అని ప్రశ్నించారు. మరి ప్రభుత్వాలు ఎందుకు ఉచిత పథకాలు తీసుకువస్తున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సంపద సృష్టించే మార్గం చూడాలి కానీ.. ఇలా అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం సరికాదన్నారు. గురువారం (నవంబర్ 27) గుంటూరు తెనాలిలో నిర్వహించిన సేవా జ్యోతి పురస్కార ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

సేవా జ్యోతి పురస్కార ప్రదానం సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. ప్రభుత్వం ఏది కూడా ఉచితంగా ఇవ్వకూడదనేది తన అభిప్రాయమని చెప్పారు. అయితే ఇలా ప్రజలకు ఉచితాలు ఇస్తే.. తనకేమీ నష్టం కాదని చెప్పారు. కానీ ఉదయం ఉచిత పథకాలు ఇచ్చి.. సాయంత్రం మద్యం రూపంలో ప్రభుత్వాలు మళ్లీ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయన్నారు. అయితే ఇది నవ్వులాట కాదని.. భయంకరమైన నిజం అన్నారు. పేద ప్రజలకు విద్యా, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని వెంకయ్య నాయుడు చెప్పారు. మిగతావి ఏవీ కూడా ఉచితంగా ఉవ్వకూడదన్నారు. ఉచిత పథకాలు ఏమాత్రం మంచివి కాదని తెలిపారు. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించాలని సూచించారు.