Ticker

6/recent/ticker-posts

మోడీకి సీఎం స్టాలిన్ షాక్..! తమిళ గడ్డపై అవమానం..!


ప్రధాని నరేంద్ర మోడీ అంటే అస్సలు గిట్టని రాజకీయ నేతల జాబితాలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ముందుంటారు. కేంద్రంలో మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పడంలోనూ స్టాలిన్ ఎప్పుడూ ముందుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం మోడీని నేరుగా కలిసి రాష్ట్రం తరఫున పలు విజ్ఞాపనలు ఇస్తున్న ఎంకే స్టాలిన్.. ఇవాళ మాత్రం ఆయనకు ఓ షాకిచ్చారు.


తమిళనాడులోని మదురై, కోయంబత్తూరు నగరాలకు మెట్రో ప్రాజెక్టులు ఇవ్వాలని ప్రధాని మోడీని సీఎం స్టాలిన్ ఎప్పటినుంచో కోరుతున్నారు. అలాగే తాజాగా ప్రధాని మోడో కోయంబత్తూరు పర్యటన ఖరారు కావడంతో ఆయన ముందు రైతులకు సంబంధించిన మూడు డిమాండ్లను ఉంచారు. తమిళనాడుకు వరి సేకరణ లక్ష్యాన్ని ప్రస్తుత పరిమితికి మించి పెంచడం, వర్షాల కారణంగా తేమ శాతాన్ని 17 శాతం నుంచి 22 శాతానికి పెంచడం, మిల్లుల్లో కార్యకలాపాలను వేగవంతం చేయడానికి 25 కిలోలకు బదులుగా 50 కిలోల సంచులలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ప్యాకింగ్‌ను అనుమతించడం ఇందులో ఉన్నాయి. వీటిని తక్షణం ఆమోదించాలని స్టాలిన్ లేఖ రాశారు.

అయితే వీటిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే కోయంబత్తూరులో దక్షిణాది రాష్ట్రాల నేచురల్ ఫార్మింగ్ సదస్సులో పాల్గొనడంతో పాటు పీఎం కిసాన్ 21వ విడత నిధుల విడుదల కోసం ప్రధాని మోడీ ఇవాళ రాష్ట్రానికి వచ్చారు. ఈ కార్యక్రమాలకు హాజరవుతున్న ప్రధాని మోడీని కోయంబత్తూరు ఎయిర్ పోర్టులో సీఎం స్టాలిన్ రిసీవ్ చేసుకోవాల్సి ఉంది. కానీ ఆయన ప్రధానికి ఆహ్వానం పలికేందుకు వెళ్లలేదు. తనకు బదులు కేబినెట్ లో ఓ మంత్రిని పంపి ఊరుకున్నారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.