Ticker

6/recent/ticker-posts

షర్మిల స్కెచ్: చంద్రబాబుకు బాండ్ పేపర్..!!


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు కుదుర్చుకున్న పరస్పర అవగాహన ఒప్పందాల వల్ల ఎన్ని పరిశ్రమలు వచ్చాయి.. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని నిలదీశారు.


రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావాలని, భారీగా ఉద్యోగాల కల్పన జరగాలని, ఇదే కాంగ్రెస్ సిద్ధాంతమని షర్మిల పునరుద్ఘాటించారు. గత 11 సంవత్సరాల్లో ఎన్ని MOUలు, పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు. పెట్టుబడుల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రజల చెవిలో ఏకంగా క్యాలీఫ్లవర్లు పెట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఎంఓయూలన్నీ కూడా నాలుక గీసుకోడానికి తప్పా దేనికి ఉపయోగ పడలేదని వ్యాఖ్యానించారు.

2014- 19 మధ్య చంద్రబాబు 1,761 ఎంఓయూలు కుదుర్చుకున్నారని, వాటి విలువ 19 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అన్నారని గుర్తు చేశారు. అలాగే- 30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అని ఊదరగొట్టారని చెప్పారు. మొదటి అయిదు సంవత్సరాల్లో కనీసం 10 శాతం అయినా ఎంఓయూలు కార్యరూపం దాల్చాయా? పెట్టుబడులు ఎక్కడ పెట్టారు ? ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు ? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 

2023 మార్చిలో విశాఖ వేదికగా జగన్ గ్లోబల్ సమ్మిట్ పెట్టారని, ఇందులో 387 ఎంఓయూలులు, 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, ఆరు లక్షల ఉద్యోగాలు వస్తాయని అన్నారని, వైసీపీ అయిదేళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు డబ్బా కొట్టారని విమర్శించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు 11 ఏళ్లలో చేసుకున్న ఒప్పందాల్లో కనీసం 10 శాతం కూడా అమలు కాలేదని ఆరోపించారు. సమ్మిట్ లు పెట్టినా, సంతకాలు చేసినా, అవి వాస్తవ రూపాన్ని దాల్చట్లేదని చెప్పారు. పెట్టుబడులు, పరిశ్రమలు పేరుతో మోసం తప్ప ఉద్ధరించింది శూన్యమని అన్నారు.

చంద్రబాబు కుదుర్చుకున్న ఎంఓయూలు, సమ్మిట్ ద్వారా వచ్చిన పెట్టుబడులపై తమకు నమ్మకం కలగట్లేదని, మళ్ళీ ఇస్తామని చెప్తున్న 16.25 లక్షల ఉద్యోగాల మీద క్లారిటీ కలగట్లేదని షర్మిల అన్నారు. చంద్రబాబుకు బాండ్ పేపర్ పంపిస్తున్నామని, దీని మీద 613 ఎంఓయూలు,16.31 లక్షల ఉద్యోగాలు,13 లక్షల కోట్ల పెట్టుబడులు అని రాసి సంతకం పెట్టాలిని, ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.