Ticker

6/recent/ticker-posts

నేను తప్పు చేయలేదు".. సిట్ కస్టడీకి వెళ్తూ జైలు వద్ద చెవిరెడ్డి కేకలు


లిక్కర్ కేసులో మూడో రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

జైలు నుంచి తరలిస్తుండగా "నేను తప్పు చేయలేదు" అంటూ కేకలు

తనపై అక్రమంగా కేసులు బనాయించారని ఆరోపణ

విచారణకు చెవిరెడ్డి సహకరించడం లేదని వార్తలు

ఆయనతో పాటు వెంకటేష్ నాయుడిని కూడా ప్రశ్నిస్తున్న సిట్

లిక్కర్ కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మూడో రోజు విచారణ నిమిత్తం సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, జైలు నుంచి ఆయన్ను విచారణకు తరలిస్తున్న సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. "నేను ఏ తప్పు చేయలేదు, నాపై తప్పుడు కేసులు పెట్టారు" అంటూ చెవిరెడ్డి గట్టిగా కేకలు వేయడం అక్కడ కలకలం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే, లిక్కర్ కేసుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని కూడా సిట్ అధికారులు గురువారం కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు. ఈ క్రమంలో వారిని జైలు నుంచి బయటకు తీసుకువస్తుండగా, చెవిరెడ్డి ఒక్కసారిగా తాను నిర్దోషినంటూ నినాదాలు చేశారు. తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉండగా, గడిచిన రెండు రోజుల విచారణలో చెవిరెడ్డి నుంచి సిట్ అధికారులకు ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మూడో రోజు విచారణ కీలకంగా మారింది. కేసులో కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.