తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగకుండానే భూమి రిజిస్ట్రేషన్!
సీఎం చంద్రబాబు ఆదేశాలు.. సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్
రూ.10 లక్షల లోపు ఆస్తికి రూ.100, ఆపైతే రూ.1000 రుసుము
రిజిస్ట్రేషన్‌తో పాటే ఆటోమేటిక్ మ్యుటేషన్, ఈ-పాస్‌బుక్ జారీ
ANDHRAPRADESH:ఆంధ్రప్రదేశ్‌లో వారసత్వంగా సంక్రమించిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం వారసులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తమ గ్రామ/వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన సమీక్షా సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాదు, రిజిస్ట్రేషన్ కింద నామమాత్రపు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు. మార్కెట్ విలువ ప్రకారం ఆస్తి విలువ రూ.10 లక్షల లోపు ఉంటే కేవలం రూ.100, అంతకు మించి ఉంటే రూ.1000 స్టాంపు డ్యూటీగా చెల్లిస్తే సరిపోతుంది. యజమాని మరణ ధ్రువీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌తో పాటు వారసులందరూ ఏకాభిప్రాయంతో రాతపూర్వకంగా వస్తే, సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
గతంలో తహసీల్దార్ కార్యాలయాల్లో మ్యుటేషన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే తీవ్ర జాప్యం జరుగుతోందని, సిబ్బంది పదేపదే తిప్పిస్తున్నారని ప్రభుత్వానికి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో, ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయగానే భూ రికార్డుల్లో వివరాల నమోదు (మ్యుటేషన్) ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. దీంతో పాటు వారసులకు ఈ-పాస్‌బుక్ కూడా జారీ చేస్తారు.
ఈ విధానం అమలులోకి రావడానికి మరో రెండు, మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు విడుదల చేశాక, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ దీనిని అమలు చేస్తుంది. స్థానిక సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ పారదర్శకంగా జరగనుంది. కేవలం వారసత్వ ఆస్తులకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుందని, ఇతర రిజిస్ట్రేషన్లు యథావిధిగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
Social Plugin