Ticker

6/recent/ticker-posts

ఏపీలో మందుబాబులకు కిక్కిచ్చే వార్త


ANDHRAPRADESH:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..మందుబాబులకు కిక్ ఇచ్చే వార్తను ఇవ్వబోతోంది. సంపదను సృష్టించడంలో భాగంగా భారీగా పర్మిట్ రూమ్ లను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేపట్టింది.

దీనిపై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్ లను నెలకొల్పడానికి గల సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ అధ్యయన కమిటీని నియమించాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని లిక్కర్ షాపుల వద్ద మద్యాన్ని సేవించడానికి అధికారికంగా పర్మిట్ రూమ్ లకు అనుమతులను ఇవ్వడం వల్ల వచ్చే ఆదాయం, వాటి లైసెన్స్ ఫీజులపై ఈ కమిటీ అధ్యయనం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగన- పర్మిట్ రూమ్ లకు అనుమతులు ఇవ్వడం వల్ల సంభవించే పరిణామాలపైనా ఈ కమిటీ స్టడీ చేయవచ్చని తెలుస్తోంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ కూటమి.. రాష్ట్రంలో బ్రాండెడ్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఫలితంగా 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ లభిస్తోంది. దీనివల్ల 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 28 వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.

ఇదే తరహా ఆదాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26లోనూ ఆర్జించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అవసరమైన కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా మద్యం దుకాణాల వద్దే పర్మిట్ రూమ్ లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంది. దీనిపై అధ్యయనం చేయనుంది.

గతంలో సంవత్సరానికి 7.5 నుంచి అయిదు లక్షల రూపాయల వరకు లైసెన్స్ ఫీజు ఉండేలా పర్మిట్‌ రూమ్‌ ల ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మున్సిపల్‌ కార్పొరేషన్లలో 7.5 లక్షల రూపాయలు, మిగిలిన చోట్ల అయిదు లక్షల రూపాయలుగా వాటి ఫీజును నిర్ధారించింది. ఇప్పుడు అదే పాలసీని పునరుద్ధరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 3,736 మద్యం షాపులు ఉన్నాయి. పర్మిట్ రూమ్ ల నిర్వహణకు అనుమతులు ఇస్తే లైసెన్సులు, ఫీజుల రూపంలో 200 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 99 రూపాయలకే బ్రాండెడ్ మద్యం వల్ల ఏర్పడుతున్న లోటు ఆదాయాన్ని ఇలా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు చెబుతున్నారు.