ANDHRAPRADESH:ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కొత్త అవతారం లోకి మారారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చేపడుతోంది. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్వయంగా ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు 'వనరులు' అనే పాఠాన్ని బోధించారు. సీఎంతో పాటు మంత్రి నారా లోకేష్ సహా పలువురు అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు హాజరయ్యారు.
అంతకు ముందు పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు చంద్రబాబు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి.. హాజరు, మార్కుల వివరాలు తెలుసుకొని తల్లిదండ్రులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని, తల్లిదండ్రులు వారిపై మరింత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పాఠశాల అభివృద్ధిపై వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు.
మరోవైపు విద్యార్థులు తయారు చేసిన 'తల్లికి వందనం' పోస్టర్లు, చిత్రకళలు, కళారూపాలను చూసి మెచ్చుకున్నారు. అనంతరం మంత్రి లోకేష్ తో కలిసి పాఠశాల క్యాంపస్‌ను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు స్వయంగా క్లాస్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో నేర్చుకుంటున్న విషయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ తల్లుల పేరిట మొక్కలు నాటారు. పాఠశాల ఆవరణను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 61 వేల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో 2.28 కోట్ల మంది పాల్గొనడం విశేషం. ఒకే రోజున రెండు కోట్ల మంది తల్లిదండ్రులు-ఉపాధ్యాయులు సమావేశమయ్యే కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రభుత్వం అరుదైన రికార్డు నెలకొల్పింది.
Social Plugin