Ticker

6/recent/ticker-posts

అశోక్..అంత చిన్న రాష్ట్రం గవర్నర్ గానా? దత్తన్న కెరీర్ ముగిసినట్లేనా?


 మరోవైపు హరియాణా గవర్నర్ గా ఉన్న తెలుగు నాయకుడు బండారు దత్తాత్రేయను తప్పించారు.

ANDHRAPRADESH:2014 నుంచి (మధ్యలో ఐదేళ్లు మినహా) చూస్తే 11 ఏళ్లలో ఆరేళ్లుకు పైగా బీజేపీ-టీడీపీ పొత్తులో ఉన్నాయి. ఓ దఫా ఐదేళ్లు, ఈ దఫాలో ఏడాదికి పైగా నరేంద్ర మోదీ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. కానీ, ఇన్నేళ్లలో ఆ పార్టీకి గవర్నర్ గిరీ ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు పదవి దక్కంది. గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేయకుండా.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తారనే ఏడాదిగా ఒకటే ఊహాగానాలు సాగుతున్నాయి. వాటికి ఎట్టకేలకు తెరపడింది.

ఇక ఏడుసార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీ.. కేంద్ర విమానయాన మంత్రి, తెలుగు రాష్ట్రాల్లో 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్న రెండో నాయకుడు (మరొకరు ఏపీ సీఎం చంద్రబాబు) అశోక్ గజపతి. 1978 నుంచి నిరాటంకంగా 1999 ఎన్నికల వరకు ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్.. తొలిసారి 2004లో ఓడిపోయారు. 2009లో మళ్లీ గెలిచినా.. 2014కు వచ్చేసరికి విజయనగరం ఎంపీగా పోటీచేశారు. అప్పుడే కేంద్ర విమానయాన మంత్రి కూడా అయ్యారు. ఇక గత ఏడాది ఎన్నికల్లో అశోక్ కుమార్తె అదితి విజయలక్ష్మి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

వాస్తవానికి అశోక్ గజపతి రాజుకు టీడీపీ చైర్మన్ పదవి ఇస్తారని పెద్దఎత్తున ఊహాగానాలు వినిపించాయి. కానీ, అది బీఆర్ నాయుడికి దక్కింది. రాష్ట్రస్థాయిలో ఇంతకంటే పెద్ద నామినేటెడ్ పదవి మరోటి లేదు. అశోక్ స్థాయికి తగినది కూడా మరోటి లేదు. దీంతో గవర్నర్ పదవి ఇస్తేనే సముచిత న్యాయం అని టీడీపీ శ్రేణులు కూడా భావిస్తూ వచ్చేవి. అది ఎట్టకేలకు నెరవేరింది. కానీ,... 

అశోక్ సీనియారిటీకి గోవా రాష్ట్ర గవర్నర్ పదవి ఇవ్వడం ఏమిటో? అర్థం కావడం లేదు. ఏదో ఇచ్చాం అన్నట్లు ఉంది తప్ప ఇది ఆయనకు తగిన పదవి కాదని కొందరు అంటున్నారు. అకోశ్ ప్రస్తుత వయసు 74. పునరావాసంగా భావించినా అదీ గౌరవప్రదంగా లేదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు హరియాణా గవర్నర్ గా ఉన్న తెలుగు నాయకుడు బండారు దత్తాత్రేయను తప్పించారు. 77 ఏళ్ల దత్తన్న గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గానూ పనిచేశారు. ఇప్పుడు ఆయనను తప్పించడంలో ఆంతర్యం ఏమిటో చూడాలి. రాజకీయాల నుంచి విరమణ ఇచ్చినట్లా...? లేక మరేదైనా పెద్ద రాష్ట్రానికి గవర్నర్ గా పంపుతారా? అనేది తెలియాల్సి ఉంది.