ANDHRAPRADESH:జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై చోటుచేసుకున్న దాడి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళల మీద టీడీపీ, జనసేన నేతల దాడి- ముఖ్యమంత్రి చంద్రబాబు శాడిజానికి పరాకాష్టగా అభివర్ణించారు.
తమ పార్టీ నాయకుల మీద వరుసగా దాడులు చేయించడమే కాదు, చివరకు బీసీ మహిళా నాయకుల మీద కూడా చంద్రబాబు తన నాయకులు, కార్యకర్తలతో నిస్సిగ్గుగా దాడులు చేయిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు ఉన్నారు కదా అని, చేతిలో అధికారం ఉంది కదా అని, పోలీసులు ఎలా చెప్తే అలా వింటున్నారు కదా అని, దాడులు చేయించడం గొప్పగా భావిస్తున్నారని విమర్శించారు.
ఏం నేరం చేశారని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన స్థానిక జడ్పీ సభ్యురాలు, కృష్ణా జిల్లా ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో టీడీపీ వాళ్లను పంపి దాడులు చేయించారని జగన్. పైగా పోలీసులు ఉన్నప్పుడే, వారి సమక్షంలోనే దుర్భాషలు ఆడుతూ ఈ దాడి చేయించారని ధ్వజమెత్తారు.
దీన్ని పరిపాలన అనరు చంద్రబాబు, శాడిజం అంటారు, పైశాచికత్వం అంటారు అని జగన్ విమర్శించారు. ఒక రాజకీయపార్టీగా తమ కార్యక్రమాలు తాము చేసుకోకూడదా? ఆ కార్యక్రమాలకు పార్టీ నాయకులు, మహిళా నాయకులు హాజరు కాకూడదా? ఇదేమైనా తప్పా? మా వాళ్లని ఎందుకు హౌస్ అరెస్టు చేయాల్సి వచ్చిందని నిలదీశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇలాగే చేస్తున్నారని జగన్ గుర్తు చేశారు. తాడపత్రిలో తన సొంత ఇంటికి, తన నియోజకవర్గ కేంద్రానికి, హైకోర్టు ఆదేశాలున్నా పెద్దారెడ్డిని పోలీసులు వెళ్లనివ్వట్లేదని చెప్పారు.
పైగా పోలీసులు సినిమా స్టైల్‌లో తుపాకులు చూపించి, బరితెగించి ఆయన్ని బయటకు తీసుకెళ్లారని అన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం మీ పచ్చసైకోలతోనే, పోలీసుల సమక్షంలోనే దాడులు చేయించారని ఆరోపించారు.
కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతోమంది మీద తప్పుడు కేసులు, దొంగకేసులు పెట్టారని జగన్ అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు సహా ఎంతోమంది అమాయకులను కేసుల్లో ఇరికించారు, దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారని చెప్పారు.
తమ పార్టీకి చెందిన వందల మంది గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులు, వందలమంది సోషల్ మీడియా యాక్టివిస్టులపైన తప్పుడు కేసులు, దొంగకేసులు పెట్టి వారిని హింసించారు, తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని జగన్ అన్నారు. ఇదే సంప్రదాయాన్ని తాము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిచర్యగా కొనసాగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అని నిలదీశారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ బద్ధ పాలనను, చట్టాన్ని పూర్తిగా గాలికి వదిలేసి, ఇష్టానుసారం ప్రవర్తిస్తే పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండిపోవని జగన్ వ్యాఖ్యానించారు. అవి మారినప్పుడు, ఇప్పుడు చేస్తున్న దుర్మార్గాలకు, దారుణాలకు, అన్యాయాలకు మీరు బాధ్యతవహించాల్సి ఉంటుందని ప్రజల తరఫున హెచ్చరిస్తున్నానని చెప్పారు.
Social Plugin