Ticker

6/recent/ticker-posts

20 మందిని కస్టడీలోకి తీసుకున్నారు.. వాళ్ల అరెస్ట్ చూపించలేదు... కోర్టులో ప్రవేశపెట్టలేదు: జగన్


రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశ పాలన సాగుతోందన్న జగన్

చట్ట ప్రకారం నిరసనలు తెలిపినా అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాఖ్య

సినిమా పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని జైల్లో పెట్టారని మండిపాటు

ANDHRAPRADESH:కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని నులిమేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామికమైన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని అన్నారు. చంద్రబాబు నిరంకుశ పాలనలో ప్రజల హక్కులు అణచివేయబడుతున్నాయని దుయ్యబట్టారు. 

చట్టానికి లోబడి నిరసనలు తెలిపినా అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని జగన్ మండిపడ్డారు. "గుంటూరు మిర్చియార్డులో రైతుల పరామర్శకు వెళ్లినప్పుడు ఒక కేసు పెట్టారు. రామగిరిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై కేసు పెట్టారు. పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళితే మూడు కేసులు పెట్టి 15 మందిని అరెస్ట్ చేశారు. పల్నాడులో పోలీసు వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే ఐదు కేసులు నమోదు చేశారు. 131 మందికి నోటీసులు జారీ చేశారు. సినిమా పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని జైల్లో పెట్టారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళితే ఐదు కేసులు పెట్టి 20 మందిని కస్టడీలోకి తీసుకున్నారని జగన్ మండిపడ్డారు. వారిని అరెస్ట్ చేసినట్టు చూపించలేదని, కోర్టులో హాజరుపరచలేదని అన్నారు. తన ప్రతి పర్యటనలో అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రైతులను రానీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకోసం పోలీసు వ్యవస్థను వాడుకోవడం సరికాదని అన్నారు.