ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఆంగన్ వాడీ కేంద్రాల బలోపేతానికి నడుం బిగించింది. పిల్లలకు ప్రాథమిక విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించడానికి కసరత్తు పూర్తి చేస్తోంది. ఆంగన్ వాడీలకు మౌలిక సదుపాయాలను సమకూర్చడానికి చర్యలు తీసుకుంటోంది.
తెలంగాణ అంగన్‌వాడీలు దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచేలా తీర్చిదిద్దాలని.. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్ వాడీలకు వచ్చే పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు అయిదేళ్ల వరకు వారికి ప్రాథమిక విద్యను అందించి నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా చూడాలని సీఎం సూచించారు.
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారిత శాఖలపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీలకు నూతన భవనాలు నిర్మించే విషయంలో అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని, పిల్లల అవసరాలకు తగినట్లు కంటైనర్లతో డిజైన్ చేయించే అంశాన్ని అధ్యయనం చేయించాలని పేర్కొన్నారు.
సోలార్ ప్లేట్లు, బ్యాటరీ బ్యాకప్‌తో కంటైనర్ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే తక్కువ వ్యయం, ఎక్కువ సౌకర్యం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న కంటైనర్ కేంద్రాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లోని ప్రతి పిల్లవానికి పౌష్టికాహారం అందించాలని.. ఇందుకు ఎన్జీవోల సేవలు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బాలామృతం ప్లస్‌ను పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అన్నారు. కర్ణాటకలో జొన్న రొట్టెలను వినియోగిస్తున్నారని, పౌష్టికాహార నిపుణులతో చర్చించి వాటిని మహిళా సంఘాలతో పిల్లలకు అందించే అంశంపైనా దృష్టిసారించాలని సీఎం తెలిపారు.
అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం అందజేత, అంగన్‌వాడీల పర్యవేక్షణ, నిర్వహణపై వంద రోజుల కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమం విషయంలో అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు కలిసే పని చేయాలని అన్నారు.
అనాథ పిల్లలకు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తున్నారని, అదే సమయంలో ఏటీసీల్లోనూ వాళ్లకు ప్రవేశాలు కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మన పిల్లలను సింగపూర్‌లోని నైపుణ్య శిక్షణ కేంద్రాలకు పంపే ఒప్పందం చేసుకున్నామని, అక్కడకు పంపే వారిలో అనాథ పిల్లలకు చోటు కల్పించాలని సీఎం ఆదేశించారు.
ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని మురికివాడలు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నిర్దేశిత సమయంలో అక్కడి పిల్లలకు ఆయా వాహనాల ద్వారా పౌష్టికాహారం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు.
విశ్రాంత ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ఆయా పిల్లలకు బోధన చేసేందుకు ఆసక్తి చూపితే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. తెలంగాణ ఫుడ్స్, విజయా డెయిరీ ఉత్పత్తులను అంగన్‌వాడీలకు అందేలా చూడాలని సీఎం అన్నారు..
ఉద్యోగాలు చేస్తున్న పలువురు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, అటువంటి వృద్ధులకు ప్రభుత్వం అండగా నిలవాల్సి ఉందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల వేతనాల నుంచి నేరుగా వారి తల్లిదండ్రులకు ఖాతాలకు 10-15 శాతం జమ అయ్యే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు.
అస్సాంలో ఇప్పటికే అటువంటి పథకం అమలవుతోందని.. ఇతర రాష్ట్రాల్లో ఇంకా అటువంటివి ఏవైనా ఉంటే పరిశీలించి ఒక నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ట్రాన్స్‌జెండర్లకు ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అవకాశం కల్పించామని, వారి సేవలను రవాణా, దేవాదాయ శాఖ, వైద్యారోగ్య శాఖలతో పాటు ఐటీ, ఇతర కంపెనీల సేవల్లో వినియోగించుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు..
తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్‌లో చిన్నారులు, మహిళలు, దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై విధానాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దివ్యాంగుల మధ్య వివాహాలు, వివిథ పథకాల్లో దివ్యాంగులకు ప్రోత్సాహాకాలు కల్పించే విషయంపై అధ్యయం చేసి వచ్చే క్యాబినెట్ సమావేశం నాటికి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.
సమీక్షలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, మహిళా, శిశు శాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ సృజన, తెలంగాణ ఫుడ్స్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.
Social Plugin