Ticker

6/recent/ticker-posts

ఎయిరిండియా విమాన ప్రమాదం ఎఫెక్ట్: బేగంపేట ఎయిర్‌పోర్ట్ సమీపంలో భవనాల కూల్చివేతకు రంగం సిద్ధం


హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ చుట్టూ భవనాల కూల్చివేతకు ఆదేశం

విమాన భద్రత కోసం బహుళ అంతస్తుల భవనాలపై అధికారుల చర్యలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్రం కఠిన నిబంధనలు

కొత్తగా 'ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 2025' ముసాయిదాను విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నాయనే కారణంతో బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో తమ నివాసాలను కోల్పోతామని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల ఎయిరిండియా విమాన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ దేశవ్యాప్తంగా విమానాశ్రయాల భద్రతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా విమానాశ్రయాల సమీపంలోని నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే 'ఎయిర్‌క్రాఫ్ట్ (డిమోలిషన్ ఆఫ్ ఆబ్‌స్ట్రక్షన్) రూల్స్ 2025' పేరుతో ఒక ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.

ఈ నిబంధనల ప్రకారం, ఏరోడ్రోమ్ జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాల ఎత్తును తగ్గించడం లేదా అవసరమైతే పూర్తిగా కూల్చివేయడం వంటి చర్యలు చేపట్టనున్నారు. ఈ కొత్త నిబంధనల నేపథ్యంలోనే అధికారులు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయ పరిసరాల్లో ఉన్న బహుళ అంతస్తుల భవనాలపై దృష్టి పెట్టారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించిన కొన్ని నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యలతో దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న ప్రజలు ఒక్కసారిగా నిరాశ్రయులయ్యే పరిస్థితి ఏర్పడింది.