Ticker

6/recent/ticker-posts

ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకిన తల్లి.. విశాఖలో విషాదం


తల్లీకొడుకులు మృతి, పాపను కాపాడిన గ్రామస్థులు

విశాఖ జిల్లా పెందుర్తిలో విషాద ఘటన

భర్త వేధింపులే కారణమని ప్రాథమిక సమాచారం

విశాఖపట్నం జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకింది. ఈ దుర్ఘటనలో తల్లీకొడుకులు మృతి చెందగా, అదృష్టవశాత్తూ కుమార్తె ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన పెందుర్తి మండలం సత్యవాణిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సత్యవాణిపాలెం గ్రామానికి చెందిన కొల్లు గీత, పవన్ దంపతులు.. వారికి ఇద్దరు పిల్లలు మణికంఠ (7), మోక్షశ్రీ (9) ఉన్నారు. ఇటీవల పవన్ మద్యానికి బానిసై గీతను వేధింపులకు గురిచేస్తున్నాడని గ్రామస్థులు తెలిపారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురైన గీత.. ఇంటి సమీపంలోని బావిలో పిల్లలను తోసేసి తాను కూడా దూకింది.

ఈ ఘటనలో గీత, ఆమె కుమారుడు మణికంఠ నీట మునిగి మృతి చెందారు. బావిలోని మెట్టును పట్టుకుని వేలాడుతున్న మోక్షశ్రీని స్థానికులు కాపాడారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీసులు, మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. భర్త వేధింపులే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.