Ticker

6/recent/ticker-posts

టీటీడీ ఊహించని నిర్ణయం, భక్తులకు ఇక ఉచితంగా - పెనుభారం..!!


తిరుమలలో వారాంతపు రద్దీ కొనసాగుతోంది. భక్తుల సౌకర్యాలు పెంచేందుకు టీటీడీ కొత్త ప్రతిపాదనల పై చర్చ చేస్తోంది. ఇప్పుడు అనూహ్య నిర్ణయం దిశగా కసరత్తు కొనసాగుతోంది. తిరుమలకు శ్రీవారి దర్శనంకు వచ్చే భక్తులకు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని టీటీడీ కొత్త ఆలోచన చేస్తోంది. ఈ మేరకు బోర్డు సమావేశంలోనూ చర్చించారు. కాగా, అమలు విషయంలోనే కీలక అంశాలు చర్చకు వస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరమలకు వస్తారు. ఆర్దికంగా భారంగా మారనుంది. టికెట్ లేని సర్వదర్శనం భక్తులకు అమలు ఎలా.. ఇలాంటి చర్చ వేళ.. బీమా ప్రతిపాదన పైన టీటీడీ తర్జన భర్జన పడుతోంది.

ఆర్దిక భారం

జనవరిలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన టీటీడీని కుదిపివేసింది. ఆ ఘటనలో మర ణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి టీటీడీ ఆర్థిక సాయం చేసింది. అప్పటి నుంచే యాత్రికులకు బీమా సదుపాయం కల్పించాలన్న ఆలోచన మొదలైంది. తిరుమలకు నిత్యం 70 వేల మందికి పైగా భక్తులు వస్తూ ఉంటారు. వీరందరికీ బీమా సదుపాయం కల్పించడం సాధ్యమే నా అనే ప్రశ్న వినిపిస్తోంది. భక్తుడి తరఫునా బీమా కంపెనీలకు టీటీడీనే ఏడాది పొడవునా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థికంగా టీటీడీపై ఇది పెనుభారం మోపే అవకాశముంది. అలాగే తిరుమలకు మూడు మార్గాల్లో యాత్రికులు తిరుమల వెళ్తున్నారు. వీరందరి వివరాలు నామినీతో సహా సేకరించాల్సి ఉంటుంది. అసలు ఏ ప్రాతిపదికన టీటీడీ వీరికి బీమా చెల్లించాలి అనేది ఇప్పుడు అసలు సమస్యగా మారుతోంది.

కసరత్తు తరువాతే

భక్తుల వివరాల నమోదు కోసం ప్రత్యేక వ్యవస్థ అవసరం. అదే విధంగా ఆర్దికంగానూ భారం కానుంది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే భక్తులు, సిఫారసు లేఖలతో వెళ్లేవారు, టైమ్‌ స్లాట్‌ బుకింగ్‌తో వెళ్లేవారికి చేతిలో ఏదో ఒక ఆధారం ఉంటుంది. అయితే ఉచిత లేదా సర్వదర్శనం క్యూలో వెళ్లే యాత్రికుల వద్ద ఎలాంటి రశీదులూ, ఆధారాలూ ఉండవు. వీరికి అమలు సాధ్యమేనా అనేది సందేహంగా మారుతోంది. అయితే, ఇప్పటి వరకు బీమా అంశం ఆలోచన దశలోనే ఉంది. అమలు చేయాలంటే సుదీర్ఘ కసరత్తు అవసరం. ప్రభుత్వం తోనూ చర్చించిన తరువాత.. ఈ ప్రతిపాదన పైన కార్యాచరణ రూపొందించనున్నారు. దీని పైన ఆధ్యాత్మిక ప్రముఖుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.