ANDRAPRADESH: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలివైన రాజకీయవేత్త. ప్రజల నాడిని పసిగట్టి, తనకున్న బలమైన మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సందేశాల్ని పంపుతుంటారు. తాజాగా టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఊరుకోనని హెచ్చరించారు. అలాంటి వాళ్లను వదులుకోడానికి కూడా సిద్ధమని ఆయన హెచ్చరించారు. అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని ఆయన అన్నారు.
ఇలాంటి హెచ్చరికల ద్వారా ప్రజల్లోకి ఓ సందేశం పంపాలని చంద్రబాబు భావించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులపై చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉన్నారనేదే ఆ సందేశం. చంద్రబాబు మంచిగా ఆలోచిస్తున్నారని, మన ఎమ్మెల్యే, మంత్రే చంద్రబాబు కన్నుగప్పి దోపిడీకి పాల్పడుతున్నారని ప్రజలు అనుకుంటారనేది సీఎం వ్యూహం. దీన్ని కొట్టి పారేయలేం.
కనీసం టీడీపీ కార్యకర్తలు, నాయకుల వరకైనా సానుకూల ఆలోచనతో వుంటారు. అయితే అధికారంలో ఉన్న ఐదేళ్లు… అరాచకాలకు పాల్పడుతూ, ప్రజల్ని పీడించే వాళ్లను ఎన్నికల సమయంలో వదులుకుంటే ప్రయోజనం ఏంటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. గతంలో వైఎస్ జగన్ కూడా ఇలాగే సుమారు 90 మంది ఎమ్మెల్యేలను మార్చేశారు. చివరికి ఫలితం ఏమైందో అందరికీ తెలుసు. ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పు చేసినా, మూల్యం తానే చెల్లించుకోవాల్సి వస్తుందని చంద్రబాబు గుర్తించాలి.
ఏదో ఎన్నికల సమయంలో చెడ్డపేరు తెచ్చుకున్న ఎమ్మెల్యేలు లేదా ఎంపీలకు టికెట్ ఇవ్వకుంటే సరిపోతుందని చంద్రబాబు ఆలోచనగా వుంది. కానీ అది సరైంది కాదు. ఎన్నికల్లో కోట్లాది రూపాయిలు పెట్టుబడి పెట్టామని, దాన్ని ఇప్పుడు కాకపోతే, మరెప్పుడు రాబట్టుకోవాలని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టినవే అరాచకాలు. చంద్రబాబు హెచ్చరికలు ఎలా వున్నాయంటే, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటాననే రీతి. రాజకీయాల్లో ఎప్పుడూ ఇది వర్కౌట్ కాదు.
ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవాళ్లని వదులుకోవాల్సి వస్తే, ఎంత మంది ఉన్నారో లెక్క గట్టగలరా? 25 శాతం మంది ప్రజాప్రతినిధుల్ని మినహాయిస్తే, మిగిలిన అందరినీ వదులుకోవాల్సి వస్తుందని చంద్రబాబుకు తెలియదని అనుకోవాలా? ఏదైనా మొదట్లోనే కంట్రోల్ చేసి వుండాలి. చేయి దాటాక, లబోదిబోమంటే ప్రయోజనం శూన్యం. కావున చంద్రబాబు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపడితే, నష్టాన్ని నివారించుకోవచ్చు. తన సహజ ధోరణిలో నాన్చివేత విధానాల్ని అవలంబిస్తే పుణ్యకాలం కాస్త కరిగిపోతుందని గ్రహించాలి.
Social Plugin