Ticker

6/recent/ticker-posts

కొండా మురళికి కాంగ్రెస్ షాక్.. వారంరోజుల డెడ్ లైన్.. ఉత్కంఠ!


ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి దంపతులు వర్సెస్ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అన్నట్టు ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరి మధ్య చోటు చేసుకున్న పరస్పర ఫిర్యాదుల పైన విచారణ చేపట్టిన టిపిసిసి క్రమశిక్షణ కమిటీ వారం రోజుల్లో లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ఆదేశించింది.

సొంత పార్టీ నేతలపై వ్యాఖ్యలకు వివరణ.. బలప్రదర్శన చేసిన కొండా 
నిన్న గాంధీభవన్లో మల్లురవి అధ్యక్షతన సమావేశమైన టిపిసిసి క్రమశిక్షణ కమిటీ జిల్లాలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ముఖ్య నాయకుల పైన కొండ మురళి చేసిన వ్యాఖ్యల పైన వివరణ కోరగా, మురళి గాంధీభవన్ కు తన అనుచర గణంతో చేరుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల పైన ఆరు పేజీల ఫిర్యాదు లేఖను కమిటీ చైర్మన్ మల్లు రవికి అందజేశారు. మొత్తం 150 వాహనాలతో తన బలాన్ని, బలగాన్ని ప్రదర్శిస్తూ కొండ మురళి గాంధీభవన్ వద్ద హంగామా చేశారు.

క్రమశిక్షణా కమిటీకి కొండా షాకింగ్ ట్విస్ట్ 

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలతో తనకు ఉన్న విభేదాలు, సఖ్యత పైన అసలు కారణాలను లేఖలో సవివరంగా వివరించారు. అయితే ఇదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కూడా ఆయన తన లేఖలో ప్రస్తావించారు. కొండ సురేఖ పైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. కొండ మురళి తన లేఖ ద్వారా తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. వరంగల్ జిల్లాలో తనకు ఉన్న విభేదాలకు సంబంధించి చెప్పదలుచుకున్న అంశాలను లేఖ రూపంలో అందజేశారు.

వారం రోజుల్లో రాతపూర్వక సమాధానం కావాలన్న క్రమశిక్షణా కమిటీ 

అయితే tpcc క్రమశిక్షణ కమిటీ మాత్రం తాము అడిగిన విషయాలపై వారం రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. క్రమశిక్షణ కమిటీ అడిగిన ప్రశ్నల పైన మాత్రమే వివరణ ఇవ్వాలని, కొత్త విషయాల పైన వివరణ తమకు అవసరం లేదని స్పష్టంగా చెప్పారు. తాము అడిగిన విషయాలపై వారం రోజుల్లో రాతపూర్వకంగా వివరణ పంపితే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఎటువంటి ఒత్తిడిలకు లొంగే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

కొండా మురళి ఏం సమాధానం ఇస్తారు?
 
మరి కొండా మురళి వారం రోజుల్లో క్రమశిక్షణ కమిటీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారా? వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధుల పైన ఆయన చేసిన వ్యాఖ్యలను పదేపదే సమర్థించుకున్న నేపథ్యంలో తన వ్యాఖ్యలకు సమాధానం ఏమి ఇస్తారు? క్రమశిక్షణ కమిటీ కొండ మురళి ఇచ్చే సమాధానం పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నది ఆసక్తిగా మారింది.

కాంగ్రెస్ లో కొండా వర్సెస్ లోకల్ లీడర్స్ వార్ పై టెన్షన్ కొండ మురళి పైన కఠిన చర్యలు తీసుకోకపోతే జిల్లాలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊరుకుంటారా? కఠిన చర్యలకు దిగితే కొండా ఫ్యామిలీ ఏం చేయబోతుంది? అన్నది ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్లో మొదలైన ముసలం చివరకు ఎక్కడ వరకు వెళుతుందో అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.