ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నీటి కేటాయింపులపై నిర్ణయం
ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం
HYDERABAD:తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఈ నెల 27వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఖరీఫ్ సీజన్ అవసరాల నిమిత్తం నీటి విడుదలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత సంవత్సరంలో ఇరు రాష్ట్రాల వాటాలు, ప్రాజెక్టులలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు పోను సాగునీటికి ఎంత కేటాయించాలనే అంశాలపై అధికారులు కూలంకషంగా చర్చించనున్నారు.
ఈ మేరకు కేఆర్‌ఎంబీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది. రెండు రాష్ట్రాల అధికారులు తమ తమ రాష్ట్రాల అవసరాలు, డిమాండ్లను ఈ సమావేశంలో బోర్డు ముందు ఉంచనున్నారు.
Social Plugin