తాజాగా కాగ్నిజెంట్ కూడా విశాఖలో క్యాంపస్ ప్రారంభించాలని నిర్ణయించింది. రూ.1582 కోట్ల పెట్టుబడి పెట్టనుంది
ANDRAPRADESH:ఐటీ వృద్ధిలో విశాఖ దూసుకుపోతోంది. ఏపీ ఐటీ హబ్ గా విశాఖను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం, పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటుండటంతో ప్రతిష్ఠాత్మక సంస్థలు విశాఖకు వస్తున్నాయి. ఇప్పటికే మన దేశ ఐటీ దిగ్గజం టీసీఎస్ విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుండగా, తాజాగా కాగ్నిజెంట్ కూడా విశాఖలో క్యాంపస్ ప్రారంభించాలని నిర్ణయించింది. రూ.1582 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 8000 కొత్త ఉద్యోగాలు లభించనున్నట్లు చెబుతున్నారు. మంత్రి లోకేశ్ సమక్షంలో కాగ్నిజెంట్ క్యాంపస్ ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
8000 వేల ఉద్యోగాలు వచ్చేలా క్యాంపస్ ప్రారంభిస్తున్న కాగ్నిజెంట్ కు 99 పైసలకే ఎకరా భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. వీఎంఆర్డీఏ పరిధిలోని కాపులుప్పాడ వద్ద 21.31 ఎకరాలను కాగ్నిజెంట్ సంస్థకు కేటాయించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే కాపులుప్పాడ పరిసరాల్లో పలు ఐటీ కంపెనీలు నిర్మాణవుతున్నాయని చెబుతున్నారు. దీంతో విశాఖ ఐటీ హబ్ లో కాపులుప్పాడ ప్రపంచస్థాయి ఐటీ క్యాంపస్ల కేంద్రంగా మారే అవకాశం ఉందంటున్నారు.
విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి కాగ్నిజెంట్ ఒప్పందం చేసుకోవడం ఓ మైలు రాయిగా ఐటీ మంత్రి నారా లోకేశ్ అభివర్ణించారు. 2029 కల్లా విశాఖ కేంద్రంగా కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. విశాఖ ఐటీ హబ్ లో టాప్ -10 ఐటీ పరిశ్రమలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెబుతున్నారు. ఇప్పటికే ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను ప్రారంభించగా, టీసీఎస్, కాగ్నిజెంట్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుని భవన నిర్మాణాలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సంస్థల ద్వారా మొత్తం 20 వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. విశాఖలో మొత్తం 3 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చేలా కంపెనీల ఏర్పాటుకు ప్రయత్నించాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని చెబుతున్నారు
Social Plugin